వెలిగొండ ప్రాజెక్టు పనుల విషయంలో రాజకీయ ఆరోపణలు మళ్లీ వేడెక్కాయి. నిమ్మల రామానాయుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. జగన్ పాలనలో వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేయకుండా నిర్లక్ష్యంగా వదిలేశారని ఆరోపించారు.
మార్కాపురం పరిధిలోని వెలిగొండ టన్నెల్‌ను ప్రత్యక్షంగా పరిశీలించిన మంత్రి, టన్నెల్లో రాత్రంతా గడిపి పనుల పురోగతిని సమీక్షించారు. సుమారు 19 కిలోమీటర్లు టన్నెల్లో ప్రయాణించి, లైనింగ్ మరియు బెంచింగ్ పనులను పరిశీలించడంతో పాటు, కార్మికుల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
టన్నెల్-2లో 12వ కిలోమీటరు వద్ద చిక్కుకుపోయిన టీబీఎం (TBM) యంత్రాన్ని కూడా పరిశీలించిన మంత్రి, గత ప్రభుత్వంలో దీనిని తొలగించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. టీబీఎంను తొలగించకపోతే టన్నెల్ ద్వారా నీటి సరఫరా సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు.
ఇంకా వేల కోట్ల రూపాయల పనులు మిగిలి ఉన్నప్పటికీ, ప్రాజెక్టును పూర్తయినట్లు ప్రకటించడం ద్వారా రైతులను మోసం చేశారని మంత్రి నిమ్మల ఆరోపించారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తి అయితే ప్రకాశం జిల్లా రైతులకు భారీగా లాభం చేకూరుతుందని, ప్రస్తుతం ప్రభుత్వం పనులను వేగవంతం చేస్తున్నట్లు తెలిపారు.
ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అమలైతే సాగునీటి సమస్యలు తగ్గి, ప్రాంతీయ వ్యవసాయానికి ఊపిరి పోసే అవకాశముందని స్థానిక రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి చంద్రబాబు కృషిని ప్రశంసించిన ప్రధాని మోదీ, జన్మదిన శుభాకాంక్షలు…
