పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు ఛానల్‌పై గత ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తీవ్రంగా విమర్శించారు. ప్రత్తిపాడు ప్రాంతానికి ఈ ఛానల్ అత్యంత కీలకమని, ఇందులో నీటి ప్రవాహం లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఛానల్‌ను ప్రత్యక్షంగా పరిశీలించిన ఆయన, గుంటూరు ఛానల్లో గుర్రపు డెక్క పేరుకుపోవడం వల్ల నీటి సరఫరా సక్రమంగా జరగడం లేదని వివరించారు. గతంలో పనులను పట్టించుకోకపోవడం వల్ల సమస్యలు మరింత పెరిగాయని అన్నారు.
ప్రస్తుతం ప్రభుత్వం ఈ ఛానల్ ఆధునికీకరణతో పాటు పొడిగింపు పనులను చేపడుతోందని తెలిపారు. 47 కిలోమీటర్ల నుంచి 74 కిలోమీటర్ల వరకు ఛానల్‌ను విస్తరించనున్నట్లు చెప్పారు. ఇందుకోసం సుమారు రూ.70 కోట్లతో భూమి కేటాయింపు పూర్తయిందని వెల్లడించారు.
ఈ ప్రాజెక్టు పూర్తయితే దాదాపు 75 వేల ఎకరాల సాగుకు నీరు అందడంతో పాటు 50 గ్రామాలకు తాగునీటి సౌకర్యం లభిస్తుందని చెప్పారు. ఆధునికీకరణ కోసం రూ.369 కోట్ల పరిపాలన అనుమతి ఇప్పటికే మంజూరైనట్లు పేర్కొన్నారు.
ఇదే సందర్భంలో ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు మాట్లాడుతూ, గత పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తోందని తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం గుంటూరు ఛానల్ పనులు వేగంగా కొనసాగుతున్నాయని అన్నారు.
ఈ ప్రాజెక్టు పూర్తయితే ప్రాంతీయ వ్యవసాయానికి పెద్ద ఊరట లభిస్తుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
కార్మికుల కోసం సీఎం చంద్రబాబు భారీ వరాలు.. మేడే సందర్భంగా కీలక ప్రకటనలు….
