ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్ ధరలు భారీగా పెరగడంపై మాజీ వైసీపీ ఎంపీ V Vijayasai Reddy రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. గతంలో ఏపీ రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించిన విజయసాయిరెడ్డి.. ఇటీవల మళ్లీ సోషల్ మీడియాలో యాక్టివ్ అవుతూ వివిధ అంశాలపై స్పందిస్తున్నారు. ముఖ్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలపై తన అభిప్రాయాలను ట్వీట్ల రూపంలో వెల్లడిస్తున్నారు.
తాజాగా పెట్రోల్ ధరల పెరుగుదలపై స్పందించిన ఆయన.. ముఖ్యమంత్రి N Chandrababu Naidu నేతృత్వంలోని ప్రభుత్వాన్ని ఉద్దేశించి కీలక డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్ ధరలు దేశంలోనే అత్యధిక స్థాయికి చేరాయని, దీనివల్ల ప్రజలపై తీవ్ర ఆర్థిక భారం పడుతోందని ఆయన పేర్కొన్నారు.
ఇటీవల అంతర్జాతీయ పరిస్థితులు, ముఖ్యంగా అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచింది. ఈ పెంపుతో ఏపీలో పెట్రోల్ ధర లీటరుకు రూ.113 వరకు చేరుకుంది. ఇప్పటికే రాష్ట్రంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇంధన ధరలు ఎక్కువగా ఉండగా, తాజా పెంపు ప్రజలను మరింత ఇబ్బందులకు గురిచేస్తోందని విజయసాయిరెడ్డి ఆరోపించారు.
తన ట్వీట్లో ఆయన మరో ముఖ్యమైన అంశాన్ని ప్రస్తావించారు. సరిహద్దు జిల్లాలకు చెందిన చాలా మంది వాహనదారులు తక్కువ ధరలు ఉన్న పొరుగు రాష్ట్రాలకు వెళ్లి ఇంధనం నింపించుకుంటున్నారని తెలిపారు. దీనివల్ల ప్రజలకు కొంత ఉపశమనం లభిస్తున్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయ నష్టం జరుగుతోందని పేర్కొన్నారు. రాష్ట్రంలోనే ధరలు తగ్గిస్తే ఈ పరిస్థితిని నియంత్రించవచ్చని సూచించారు.
ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు పెట్రోల్ ధరలను కనీసం పొరుగు రాష్ట్రాల స్థాయికి తీసుకురావాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర పన్నులను తగ్గించడం ద్వారా ఇంధన ధరలను తగ్గించే అవకాశం ఉందని, ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
అయితే రాజకీయంగా ఈ అంశం ఆసక్తికరంగా మారింది. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం చేసిన పెంపును విమర్శిస్తూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి ఉపయోగించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. వైసీపీ కూడా ప్రస్తుతం ఇదే డిమాండ్‌ను ప్రజల్లో బలంగా వినిపిస్తోంది.
ఇంధన ధరలు పెరగడం వల్ల కేవలం వాహనదారులకే కాకుండా అన్ని వర్గాల ప్రజలపై ప్రభావం పడుతోంది. రవాణా ఖర్చులు పెరగడంతో నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. దీంతో మధ్యతరగతి, చిన్న వ్యాపారులు, ఉద్యోగులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు.
ఇక ఈ వ్యవహారంపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ప్రజల ఒత్తిడి, ప్రతిపక్ష విమర్శల నేపథ్యంలో ఇంధన ధరలపై రాష్ట్ర ప్రభుత్వం ఏవైనా ఉపశమన చర్యలు ప్రకటిస్తుందా అన్నది చూడాలి.
అమెరికా సుంకాలతో ఇండియాకు నష్టం కంటే లాభమే ఎక్కువ! ఎలాగంటే..?
