ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో 7వ కలెక్టర్ల కాన్ఫరెన్స్ గురువారం అమరావతిలోని సచివాలయంలో నిర్వహించారు. రాష్ట్ర అభివృద్ధి, జీఎస్డీపీ వృద్ధి, పెట్టుబడులు, విద్య, వైద్యం వంటి కీలక అంశాలపై ఈ సమావేశంలో సమగ్ర చర్చ జరిగింది.
సచివాలయం ఐదో బ్లాక్‌లోని కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన ఈ సమావేశానికి సీఎస్ సాయిప్రసాద్, జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. “బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్” అవార్డు అందుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు మంత్రులు, అధికారులు అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా రాష్ట్ర జీఎస్డీపీ గ్రోత్, జిల్లాల వారీ ఆర్థిక వృద్ధి అంచనాలపై సీఎం ప్రత్యేకంగా సమీక్షించారు. వాణిజ్య పన్నుల శాఖ చీఫ్ కమిషనర్ బాబు, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు పీయూష్ కుమార్, రోనాల్డ్ రోస్, వినయ్ చంద్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇచ్చారు.
ఇటీవల సింగపూర్ పర్యటనకు వెళ్లిన మంత్రులు తమ అనుభవాలు, అక్కడి పరిపాలనా విధానాలు, అభివృద్ధి నమూనాలపై వివరాలు వెల్లడించారు. మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, నారాయణ, వంగలపూడి అనిత, సత్యకుమార్ యాదవ్, అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్దన్ రెడ్డి ప్రత్యేక ప్రజెంటేషన్లు ఇవ్వనున్నారు.
అలాగే “స్వర్ణాంధ్ర విజన్ 2047” లక్ష్యాల సాధన, విద్యా రంగం, వైద్య సేవలు, పెట్టుబడుల గ్రౌండింగ్, జలధార కార్యక్రమం వంటి అంశాలపై సీఎం అధికారులతో చర్చించారు. జిల్లాల్లో అమలు చేస్తున్న ఉత్తమ పద్ధతులను ఆయా కలెక్టర్లు సమావేశంలో ప్రదర్శించారు.
రాష్ట్ర ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేయడంతో పాటు పరిపాలనలో పారదర్శకత, సమర్థత పెంచడమే ఈ కలెక్టర్ల కాన్ఫరెన్స్ ముఖ్య ఉద్దేశ్యమని అధికారులు పేర్కొన్నారు.
