స్వాతంత్ర్య సమరయోధుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘన నివాళులు అర్పించారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన అల్లూరి త్యాగాలను స్మరించుకున్నారు.
“గిరిజన హక్కుల పరిరక్షణ కోసం మన్యం ప్రజల గుండెల్లో పౌరుషాగ్ని రగిలించిన విప్లవ యోధుడు అల్లూరి సీతారామరాజు” అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. బ్రిటిష్ పాలకులను గడగడలాడించిన ధైర్యసాహసాల ప్రతీకగా అల్లూరి నిలిచారని కొనియాడారు.
తెలుగు జాతి గర్వించదగ్గ మహానుభావుడైన అల్లూరి సీతారామరాజు దేశభక్తి, త్యాగం, పోరాటస్ఫూర్తి తరతరాలకు ఆదర్శమని సీఎం తెలిపారు. ఆయన వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడి చరిత్రను స్మరించుకుంటూ ప్రతి ఒక్కరూ నివాళులు అర్పించాలని పిలుపునిచ్చారు.
అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా గిరిజనులతో కలిసి రంపా తిరుగుబాటును నడిపించి స్వాతంత్ర్య ఉద్యమంలో చిరస్థాయిగా నిలిచారు. ఆయన సేవలను గుర్తుచేసుకుంటూ రాష్ట్రవ్యాప్తంగా పలువురు ప్రజాప్రతినిధులు, నేతలు నివాళులు అర్పిస్తున్నారు.
