ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసిటీ దేశంలోనే అతిపెద్ద ఎయిర్ కండిషనర్ల తయారీ కేంద్రంగా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇప్పటికే LG, Daikin, Havells, Blue Star, Amber Enterprises వంటి ప్రముఖ సంస్థలు తమ యూనిట్లను ఇక్కడ స్థాపించాయి.
ఇవే కాకుండా అనేక విడిభాగాల సరఫరా సంస్థలు కలిపి మొత్తం 30కి పైగా కంపెనీలు శ్రీసిటీలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో తయారవుతున్న ఏసీలలో దాదాపు 40% ఇక్కడే ఉత్పత్తి అవుతుండగా, వచ్చే కొన్ని సంవత్సరాల్లో ఇది 70% వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ప్రపంచ ప్రఖ్యాత సంస్థ Carrier Global రూ.1000 కోట్ల భారీ పెట్టుబడితో కొత్త తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ యూనిట్లో గృహ, కార్యాలయ అవసరాలకు ఉపయోగించే చిన్న సామర్థ్యం గల ఏసీలతో పాటు, డేటా సెంటర్లు మరియు భారీ పరిశ్రమలకు అవసరమైన అధిక సామర్థ్యం గల కూలింగ్ సిస్టమ్స్ తయారు చేయనున్నారు.
ఈ ప్రాజెక్ట్ కోసం 40 ఎకరాల భూమిని కేటాయించగా, ఇది ప్రత్యక్షంగా సుమారు 1000 మందికి, పరోక్షంగా 2000 మందికి ఉపాధి కల్పించనుంది.
ఈ పరిశ్రమకు నేడు మంత్రి నారా లోకేశ్ శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం హెలికాప్టర్ ద్వారా శ్రీసిటీ చేరుకుని, కార్యక్రమంలో పాల్గొని తిరిగి వెళ్లనున్నారు.
శ్రీసిటీకి ఉన్న మౌలిక వసతులు, పోర్ట్‌కు సమీపం, అనుకూల వాతావరణం కారణంగా మరిన్ని గ్లోబల్ సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
