గుంటూరు నగరంలో రేషన్ డీలర్లు మరియు పౌర సరఫరాల ఉప తహసీల్దార్లు (సీఎస్ డీటీలు) మధ్య ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చాయి. ఈ నెల ప్రారంభం నుంచి ఇరువర్గాల మధ్య పరస్పర ఆరోపణలు, తనిఖీలు, కేసులు నమోదు వంటి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
జిల్లా అధికారుల ఆదేశాల పేరుతో సీఎస్ డీటీలు రేషన్ షాపుల్లో తనిఖీలు చేపడుతూ, స్టాక్ లోపాల పేరుతో 6ఏ కేసులు నమోదు చేసి షాపులను సీజ్ చేస్తున్నారు. అయితే దీనిని డీలర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తమ స్టాక్ సక్రమంగానే ఉన్నప్పటికీ, కొంతమంది అధికారులు కావాలనే బియ్యం బస్తాలు తీసుకువచ్చి అదనపు స్టాక్ ఉన్నట్లు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.
ఇక మరోవైపు, కొంతమంది డీలర్లు రేషన్ బియ్యాన్ని కార్డుదారుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి, రేషన్ మాఫియాకు మళ్లిస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అలాగే కొందరు తమ పేరుతో షాపులు మంజూరు చేయించుకుని, వాటిని ఇతరులకు సబ్‌లీజ్ ఇచ్చిన ఘటనలు బయటపడుతున్నాయి.
ఇరువర్గాల మధ్య ఒప్పందం ఉన్నప్పుడు సమస్యలు తలెత్తకపోయినా, భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు పరస్పర చర్యలు తీవ్రతరం అవుతున్నాయి. ప్రస్తుతం జిల్లాలో 972 రేషన్ షాపుల్లో 928 మాత్రమే యాక్టివ్‌గా ఉండగా, 34 షాపులు సీజ్ చేయబడ్డాయని సమాచారం.
ఈ వ్యవహారం జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి చేరడంతో, పరస్పర ఆరోపణలపై సమగ్ర విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పారదర్శకంగా రేషన్ పంపిణీ జరగాలని స్థానికులు కోరుతున్నారు.
కార్మికుల కోసం సీఎం చంద్రబాబు భారీ వరాలు.. మేడే సందర్భంగా కీలక ప్రకటనలు….
