ఉమ్మడి అనంతపురం జిల్లా హిందూపురం పరిధిలో ఇటీవల చోటుచేసుకుంటున్న ఘటనలు స్థానిక ప్రజల్లో తీవ్ర భయాందోళనలకు కారణమవుతున్నాయి. హిందూపురం, లేపాక్షి, చిలమత్తూరు మండలాల్లో వరుసగా నాలుగు హత్యలు జరగడం పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది. ఇందులో కొన్ని చిన్నపాటి ఘర్షణలే ప్రాణాంతకంగా మారడం ఆందోళన కలిగిస్తోంది.
ఇటీవల ఓ మహిళపై దోపిడీ ఘటన, అలాగే చిన్నారిని మోసగించి అపహరించేందుకు చేసిన ప్రయత్నం వంటి సంఘటనలు భద్రతా లోపాలపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. చిన్నారి కేకలు వేయడంతో స్థానికులు స్పందించి రక్షించడం ఒకింత ఊరటనిచ్చినా, ఇలాంటి ఘటనలు పునరావృతం కావడం ప్రజల్లో భయాన్ని పెంచుతోంది.
పోలీసులు వెంటనే స్పందించి నేరస్తులను పట్టుకుంటున్నప్పటికీ, అసాంఘిక కార్యకలాపాలు తగ్గుముఖం పట్టడం లేదు. పేకాట, మట్కా వంటి అక్రమాలు పట్టణంలో విస్తరిస్తున్నాయి. నిర్వాహకులను పట్టుకుని కోర్టుకు పంపుతున్నా, కఠిన చర్యలు లేకపోవడం వల్ల నేరస్థుల్లో భయం తగ్గిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇటీవల పోలీస్ స్టేషన్లలో కొత్త సిబ్బంది చేరడం వల్ల పట్టణంపై పూర్తి పట్టు సాధించడానికి సమయం పడుతోంది. ఈ లోటును ఆసరాగా చేసుకుని కొంతమంది అసాంఘిక శక్తులు విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇతర ప్రాంతాల నుంచి కూడా వ్యక్తులు వచ్చి నేరాల్లో పాల్గొంటున్నారనే సమాచారం ఉంది.
పోలీసులు తరచూ కారిడాన్ సెర్చ్‌లు నిర్వహిస్తున్నా, కొన్ని నేరాలు ఆగకపోవడం గమనార్హం. ప్రజల భద్రత కోసం మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
కార్మికుల కోసం సీఎం చంద్రబాబు భారీ వరాలు.. మేడే సందర్భంగా కీలక ప్రకటనలు….
