తెలుగుదేశం పార్టీ విజన్ పాలిటిక్స్‌కు నాంది పలికిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మంగళగిరిలో నిర్వహించిన మహానాడు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, టీడీపీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు పార్టీ ప్రయాణం ప్రజల విశ్వాసం, సంక్షేమం, అభివృద్ధి అనే మూడు ప్రధాన సూత్రాలపై సాగిందని వివరించారు.
ఈసారి మహానాడును ప్రత్యేకంగా హైబ్రిడ్ విధానంలో నిర్వహిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. పశ్చిమాసియా ప్రాంతంలో నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా భద్రతా పరమైన జాగ్రత్తల దృష్ట్యా వర్చువల్ పద్ధతిని కూడా ఉపయోగిస్తున్నామని చెప్పారు. అయితే సమావేశం విధానం మారినా, మహానాడు ఉత్సాహం మాత్రం ఏమాత్రం తగ్గలేదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 1875 క్లస్టర్ల ద్వారా కార్యకర్తలు మహానాడులో పాల్గొంటున్నారని, తొలి రోజే లక్షలాది మంది స్పందన ఇచ్చారని తెలిపారు.
“సమాజమే దేవాలయం – ప్రజలే దేవుళ్లు” అనే సిద్ధాంతంతో 44 ఏళ్ల క్రితం టీడీపీ ఆవిర్భవించిందని చంద్రబాబు గుర్తుచేశారు. సంక్షేమం, సుపరిపాలన, అభివృద్ధి అనే భావనలను ప్రజలకు పరిచయం చేసిన పార్టీ తెలుగుదేశమేనని అన్నారు. మహిళా సాధికారత, సామాజిక న్యాయం, పేదల సంక్షేమం వంటి అంశాల్లో టీడీపీ ఎప్పుడూ ముందుండిందని పేర్కొన్నారు.
ప్రస్తుతం హైబ్రిడ్ విధానంలో జరుగుతున్న మహానాడులో టెక్నాలజీ వినియోగాన్ని కూడా ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఏ తీర్మానానికి ఎంతమంది మద్దతు ఇస్తున్నారో రియల్ టైమ్‌లో తెలుస్తోందని, భవిష్యత్తులో అత్యాధునిక టెక్నాలజీని రాష్ట్రానికి తీసుకురావాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. యువత టెక్నాలజీని సద్వినియోగం చేసుకుని ప్రపంచ స్థాయిలో పోటీ పడాలని పిలుపునిచ్చారు.
టీడీపీ జెండా తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అని చంద్రబాబు అన్నారు. జాతీయ జెండా దేశ గౌరవానికి చిహ్నమైతే, పసుపు జెండా తెలుగువారి గౌరవం, నమ్మకం, ఆత్మవిశ్వాసానికి గుర్తని వ్యాఖ్యానించారు. 45 ఏళ్లుగా ప్రజా సమస్యల కోసం టీడీపీ నిరంతరం పోరాటం చేస్తోందని తెలిపారు.
వైసీపీ పాలనలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని చంద్రబాబు ఆరోపించారు. దాడులు, అక్రమ కేసులు, వేధింపులు, హింస జరిగినప్పటికీ టీడీపీ వెనక్కి తగ్గలేదని చెప్పారు. పార్టీ కార్యకర్త చంద్రయ్యను ఉదాహరణగా ప్రస్తావిస్తూ, చివరి క్షణం వరకూ ‘జై తెలుగుదేశం’ అంటూ పోరాడారని గుర్తు చేశారు. ఆయన త్యాగస్ఫూర్తి పార్టీకి ఎప్పటికీ ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు.
తనను అక్రమంగా జైలుకు పంపించారని, లోకేష్ యువగళం యాత్రను అడ్డుకున్నారని చంద్రబాబు ఆరోపించారు. అయినప్పటికీ ప్రజాస్వామ్యం కోసం టీడీపీ పోరాటం కొనసాగించిందని పేర్కొన్నారు. అనంతరం బీజేపీ, జనసేనతో కలిసి కూటమిగా ఏర్పడి రాష్ట్ర పునర్నిర్మాణం కోసం పనిచేస్తున్నామని తెలిపారు.
మహిళలకు ఆస్తి హక్కులు కల్పించడం నుంచి “తల్లికి వందనం” వంటి సంక్షేమ కార్యక్రమాల వరకు టీడీపీ అనేక సంస్కరణలు తీసుకువచ్చిందని చంద్రబాబు వివరించారు. స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించామని, చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు అమలయ్యే వరకు పోరాటం కొనసాగిస్తామని హామీ ఇచ్చారు.
రాష్ట్ర అభివృద్ధి విషయంలో టీడీపీ ఎప్పుడూ ముందుంటుందని, ఒకప్పుడు “ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్” నుంచి “స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్” వైపు రాష్ట్రాన్ని తీసుకెళ్లామని చంద్రబాబు తెలిపారు. యువత, టెక్నాలజీ, పారిశ్రామిక అభివృద్ధి కలిసొస్తే ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
Ebola Outbreak Alert: DGCA Issues Strict Guidelines for Airlines and Passengers
