జగన్కు మాజీ సన్నిహితుడు.. ఇప్పుడు చంద్రబాబుతో ప్రత్యేక భేటీ
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా వైసీపీని వీడి జనసేనలో చేరిన తర్వాత బాలినేని తొలిసారిగా చంద్రబాబును కలవడం ఈ సమావేశానికి మరింత ప్రాధాన్యత తీసుకొచ్చింది.
సచివాలయంలోని ముఖ్యమంత్రి ఛాంబర్లో జరిగిన ఈ సమావేశం మర్యాదపూర్వకంగానే జరిగినప్పటికీ, రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, కూటమి బలోపేతం, భవిష్యత్ వ్యూహాలపై కీలక చర్చలు జరిగినట్లు సమాచారం. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సమస్యలు, కూటమి పార్టీల సమన్వయం వంటి అంశాలు కూడా ఈ భేటీలో ప్రస్తావనకు వచ్చినట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
బాలినేని శ్రీనివాసరెడ్డి రాజకీయ ప్రస్థానం చాలా ఆసక్తికరంగా సాగింది. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకుడిగా ఉన్న ఆయన, తర్వాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైసీపీ స్థాపించినప్పుడు ఆయన వెంట నడిచారు. వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీ బలోపేతానికి పనిచేసిన బాలినేని.. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రిగా కూడా పనిచేశారు.
అయితే 2024 ఎన్నికల తర్వాత రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. వైసీపీ ఘోర పరాజయం పాలవడంతో పాటు, పార్టీలో తనకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని బాలినేని అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాకుండా తన ఆర్థిక, రాజకీయ స్థాయిని దెబ్బతీయడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ వైసీపీకి రాజీనామా చేశారు.
ఆ తర్వాత కొంతకాలానికే జనసేన పార్టీ కండువా కప్పుకున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా బాలినేనికి పార్టీ పరంగా కీలక బాధ్యతలు అప్పగించారు. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు, డీలిమిటేషన్ ప్రక్రియ దృష్ట్యా జిల్లాల వారీగా కమిటీలను ఏర్పాటు చేసిన జనసేన.. రాయలసీమతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల బాధ్యతలను బాలినేనికి అప్పగించింది.
ఈ నేపథ్యంలో ఆయన జిల్లాల పర్యటనలు కూడా ప్రారంభించారు. స్థానిక నేతలతో సమావేశాలు, కూటమి కార్యకర్తలతో చర్చలు నిర్వహిస్తూ రాజకీయంగా మరింత చురుకుగా మారారు. ఇప్పుడు సీఎం చంద్రబాబుతో ఆయన భేటీ కావడం కూటమి రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది.
ఈ సమావేశంలో కూటమి బలోపేతంపై ప్రత్యేకంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు, భవిష్యత్ రాజకీయ వ్యూహాలు, కూటమి పార్టీల మధ్య సమన్వయం వంటి అంశాలపై ఇరువురు నేతలు అభిప్రాయాలు పంచుకున్నట్లు సమాచారం. రాష్ట్రంలో వైసీపీని రాజకీయంగా మరింత బలహీనపరచడంపై కూడా చర్చ జరిగి ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
మరోవైపు బాలినేని, వైసీపీ అధినేత జగన్కు బంధువు కావడం కూడా ఈ రాజకీయ పరిణామానికి మరింత ఆసక్తి తెచ్చింది. ఒకప్పుడు జగన్కు అత్యంత సన్నిహితుడిగా పేరొందిన బాలినేని.. ఇప్పుడు ప్రత్యర్థి కూటమిలో కీలక నేతగా ఎదుగుతుండటం రాజకీయంగా పెద్ద మార్పుగా భావిస్తున్నారు.
ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వేగంగా మారుతున్న సమీకరణాల మధ్య ఈ భేటీకి ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది. భవిష్యత్తులో బాలినేని పాత్ర కూటమిలో మరింత పెరిగే అవకాశముందా? ఆయనకు ప్రభుత్వం లేదా కూటమిలో మరిన్ని కీలక బాధ్యతలు వస్తాయా? అన్న చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.
