బోరు బావులు, RO ప్లాంట్లకు ఇక అనుమతి తప్పనిసరి.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్‌లో బోరు బావులు తవ్వడం, ఆర్వో (RO) వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయడంపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై ఎవరైనా బోరు బావి తవ్వాలన్నా లేదా వాటర్ ప్లాంట్ నిర్వహించాలన్నా సంబంధిత అధికారుల అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని స్పష్టం చేసింది. సురక్షిత తాగునీరు అందించడం ప్రజల ప్రాథమిక హక్కులో భాగమని పేర్కొంటూనే, అదే సమయంలో చట్టాలను పాటించడం కూడా తప్పనిసరి అని హైకోర్టు వ్యాఖ్యానించింది.
ఈ కేసు ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం విప్పగుంట గ్రామంలో నడుస్తున్న ఓ ఆర్వో ప్లాంట్‌కు సంబంధించినది. శ్రీను అనే వ్యక్తి గ్రామ ప్రజలకు తక్కువ ధరకు శుద్ధి చేసిన తాగునీరు అందించేందుకు RO ప్లాంట్ నిర్వహిస్తున్నారు. అయితే ప్లాంట్‌కు అవసరమైన అనుమతులు తీసుకోలేదని ఆరోపిస్తూ 2025 జూలైలో స్థానిక తహసీల్దార్ నోటీసులు జారీ చేశారు. కొన్ని రోజుల తర్వాత ఆర్వో ప్లాంట్‌తో పాటు బోరు బావిని కూడా అధికారులు సీజ్ చేశారు.
దీంతో ప్లాంట్ యజమాని హైకోర్టును ఆశ్రయించారు. గ్రామ ప్రజలకు తక్కువ ధరలో మంచి నీటిని అందిస్తున్నామని, ప్రజల అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ప్లాంట్ ఏర్పాటు చేశామని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. వాల్టా చట్టం ప్రకారం బోరు బావి తవ్వేందుకు ప్రత్యేక తీర్మానం అవసరం లేదని కూడా పేర్కొన్నారు. అలాగే అధికారులు తమ వాదనలు వినకుండా చర్యలు తీసుకున్నారని ఆరోపించారు.
ఈ కేసును విచారించిన హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తాగునీరు అనేది లగ్జరీ కాదని, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కులో భాగమని న్యాయస్థానం స్పష్టం చేసింది. ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని పేర్కొంది. అయితే అదే సమయంలో ఎవరైనా అనుమతులు లేకుండా బోరు బావులు తవ్వడం లేదా వాటర్ ప్లాంట్లు నిర్వహించడం చట్టవిరుద్ధమని తెలిపింది.
పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 120 ప్రకారం వాటర్ ప్లాంట్ నిర్వహించాలంటే పంచాయతీ అనుమతి అవసరమని కోర్టు గుర్తుచేసింది. అలాగే వాల్టా చట్టం ప్రకారం భూగర్భ జలాల వినియోగానికి సంబంధించి కూడా నిబంధనలు పాటించాల్సిందేనని స్పష్టం చేసింది.
పిటిషనర్ గ్రామ ప్రజలకు మినరల్ వాటర్ అందించాలనే ఉద్దేశంతో ప్లాంట్ ఏర్పాటు చేశారని కోర్టు గుర్తించింది. కానీ ప్లాంట్‌లో సరఫరా చేస్తున్న నీరు నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉందా లేదా అన్నది కూడా పరిశీలించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది. ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన అంశాల్లో నిర్లక్ష్యం ఉండకూడదని పేర్కొంది.
ఈ నేపథ్యంలో పిటిషనర్‌కు మరో అవకాశం ఇవ్వాలని కోర్టు నిర్ణయించింది. అధికారులిచ్చిన నోటీసులకు పూర్తి వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అలాగే బోరు బావి, RO ప్లాంట్‌కు సంబంధించిన అనుమతుల కోసం అధికారికంగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆ దరఖాస్తును తహసీల్దార్ మరియు సంబంధిత అధికారులు చట్ట ప్రకారం పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది.
ఈ తీర్పుతో రాష్ట్రవ్యాప్తంగా బోరు బావులు, వాటర్ ప్లాంట్లు నిర్వహిస్తున్న వారికి స్పష్టమైన సందేశం వెళ్లింది. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశం ఉన్నా, చట్టపరమైన అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఇకపై అనుమతులు లేకుండా బోర్లు తవ్వడం లేదా RO ప్లాంట్లు నిర్వహించడం కష్టమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
“I Was Misquoted”: CJI Surya Kant Clarifies Remarks Amid Media Controversy
