Indian Institute of Millets Research అభివృద్ధి చేసిన మిల్లెట్ ఆధారిత ఆహార ఉత్పత్తులు త్వరలో మార్కెట్లోకి రానున్నాయి. జొన్నల పిజ్జా, కొర్రల బర్గర్, రాగి పాస్తా, సామల నూడుల్స్, ఒరిగెల పులావ్ వంటి వంటకాలతో పాటు ఐదు రకాల చిరుధాన్యాలతో తయారైన ప్రత్యేక బియ్యాన్ని కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు.
ఆధునిక జీవనశైలితో మధుమేహం, అధిక రక్తపోటు, ఊబకాయం, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు పెరుగుతున్న నేపథ్యంలో చిరుధాన్యాల వినియోగం మళ్లీ ప్రాధాన్యం సంతరించుకుంటోంది. ఈ నేపథ్యంలో సంప్రదాయ ఆహారపు అలవాట్లను తిరిగి ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
Indian Council of Medical Research అధ్యయనాల ప్రకారం వారానికి కనీసం మూడు నుంచి నాలుగు సార్లు చిరుధాన్యాలు తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని వెల్లడైంది. మధుమేహం, ఊబకాయం నియంత్రణలో ఇవి మంచి ఫలితాలు ఇస్తున్నట్లు పరిశోధనలు సూచిస్తున్నాయి.
కొర్రలు, రాగి, సజ్జలు వంటి మిల్లెట్స్ తీసుకున్న వారిలో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గినట్లు National Institute of Nutrition పరిశోధనల్లో తేలింది. జీర్ణక్రియ మెరుగవడం, హిమోగ్లోబిన్ స్థాయిలు పెరగడం వంటి ప్రయోజనాలు కూడా గుర్తించారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా మిల్లెట్స్‌ను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలని సూచిస్తోంది. ఈ నేపథ్యంలో ఐఐఎంఆర్ రూపొందించిన ఎనలాగ్ రైస్‌కు మంచి డిమాండ్ ఏర్పడుతోంది. బిర్యానీ, పులావ్, పులిహోర వంటి వంటకాలకు ఇది అనుకూలమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఈ బియ్యాన్ని ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం లేకుండా కేవలం ఎనిమిది నిమిషాల్లో ఉడికించుకోవచ్చని అధికారులు తెలిపారు. ప్రస్తుతం రాజేంద్రనగర్‌లోని కొనుగోలు కేంద్రంలో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ ఉత్పత్తిని త్వరలో విస్తృతంగా మార్కెట్లోకి తీసుకురానున్నారు.
ప్రస్తుతం 350 గ్రాముల ఎనలాగ్ రైస్‌ను రూ.65కు విక్రయిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. తుది మార్కెట్ ధరపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
కార్మికుల కోసం సీఎం చంద్రబాబు భారీ వరాలు.. మేడే సందర్భంగా కీలక ప్రకటనలు….
