జనసేన పార్టీని బలోపేతం చేసే దిశగా కీలక మార్పులకు శ్రీకారం చుడుతున్నట్లు జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటించారు. రాజమండ్రిలో నిర్వహించిన జనసేన సాధక్ ఆత్మీయ సమావేశంలో కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన ఆయన, పార్టీ భవిష్యత్తు నిర్మాణంపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా 2007-08 కాలంలో తాను రూపొందించిన ఒక ప్రత్యేక రాజకీయ నిర్మాణ విధానాన్ని ఇప్పుడు అమలు చేయబోతున్నట్లు వెల్లడించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, “12 ఏళ్లుగా ఎంతో సహనం పాటించాను. ఇప్పుడు మీపై నమ్మకం వచ్చింది. అందుకే ప్రతి నియోజకవర్గం, ప్రతి మండలంలో కొత్త స్ట్రక్చర్ తీసుకొస్తున్నాను” అని తెలిపారు. జనసేనలో పదవులు ఇవ్వడంలో ఇకపై క్రమబద్ధమైన వ్యవస్థను అమలు చేస్తామని చెప్పారు. పార్టీ కోసం కష్టపడిన సాధక్‌లు, ఉద్యమీల అభిప్రాయాలను తీసుకున్న తర్వాతే నియోజకవర్గ, మండల ఇంఛార్జ్‌లను ఎంపిక చేస్తామని వెల్లడించారు.
ఈ సందర్భంగా ఆయన పార్టీ కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసం నింపే ప్రయత్నం చేశారు. “20 వేల మంది జనసేన సాధక్‌లు గట్టిగా మాట్లాడితే ఐదు కోట్ల ప్రజలపై ప్రభావం చూపే వ్యవస్థ కూడా కదలాలి” అని అన్నారు. జనసేన ఉద్యమకారులను తయారు చేయడానికి 12 ఏళ్లు పట్టిందని, ఇప్పుడు పార్టీని మరింత శక్తివంతం చేసే సమయం వచ్చిందని పేర్కొన్నారు.
రాజకీయ విమర్శలపై కూడా పవన్ ఘాటుగా స్పందించారు. కులం పేరుతో తనను విమర్శించే వారిపై అసహనం వ్యక్తం చేశారు. “మీకు జనసేన భావజాలం నచ్చితే మద్దతివ్వండి, లేకపోతే మౌనంగా ఉండండి. కానీ ఇష్టారాజ్యంగా మాట్లాడితే మీ ఫ్రేమ్‌వర్క్ మొత్తం బయటపెడతా” అంటూ హెచ్చరికలు చేశారు. తనను కులపరంగా విమర్శించిన నాయకులపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైసీపీపై కూడా పవన్ కళ్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ వద్ద ఎప్పుడూ రౌడీలు ఉంటారని అంటారని, కానీ జనసేన ఉద్యమకారుల శక్తిని వారు తట్టుకోగలరా అని ప్రశ్నించారు. “నేను ముఖ్యమంత్రి కావాలంటే వేరే రాజకీయ వ్యూహం వేసేవాణ్ని. కానీ నాకు అధికారం కంటే సమాజంలో మార్పు ముఖ్యం” అని చెప్పారు. తాను రాజకీయాల్లోకి వచ్చినది ప్రజలకు ధైర్యం ఇవ్వడానికేనని స్పష్టం చేశారు.
ఇకపై పార్టీ కార్యకర్తలతో వాట్సాప్ ద్వారా నేరుగా టచ్‌లో ఉంటానని పవన్ వెల్లడించారు. పార్టీ లోపల క్రమశిక్షణ చాలా ముఖ్యమని, అవసరమైతే కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని తెలిపారు. ఒంగోలు కమిటీని రద్దు చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ, నాలుగేళ్లుగా సరిదిద్దుకోవాలని చెప్పినా ఫలితం లేకపోవడంతో ఆ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
జనసేన భవిష్యత్ నిర్మాణంపై ఆయన వివరాలు వెల్లడించారు. 25 లోక్‌సభ స్థానాలకు ప్రత్యేక పరిశీలన కమిటీలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కమిటీలు నియోజకవర్గాల్లో పర్యటించి స్థానిక పరిస్థితులు, నాయకత్వ సామర్థ్యాలు, కార్యకర్తల అభిప్రాయాలు సేకరిస్తాయని చెప్పారు. ఆ నివేదికల ఆధారంగా ఇంఛార్జ్‌లు, సెక్రటరీలు, ట్రెజరర్లు నియమిస్తామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కుల రాజకీయాలు బలంగా ఉన్నాయని, అలాంటి పరిస్థితుల్లో ఇక్కడి వరకు రావడం పెద్ద విషయమని పవన్ అన్నారు. “నేను చెప్పింది నమ్మండి.. మీ నమ్మకాన్ని ఎప్పటికీ వమ్ము చేయను” అంటూ జనసైనికులకు హామీ ఇచ్చారు. తనతో విభేదించే స్వేచ్ఛ కూడా పార్టీ లోపల ఉంటుందని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో పవన్ చేసిన వ్యాఖ్యలు జనసేనలో కొత్త రాజకీయ మార్పులకు సంకేతాలుగా భావిస్తున్నారు. ముఖ్యంగా పార్టీ నిర్మాణంపై ఆయన ప్రకటించిన కొత్త విధానం భవిష్యత్తులో జనసేన రాజకీయ వ్యూహానికి కీలకంగా మారే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
From Power to Opposition: Pinarayi Vijayan Faces New Legal Challenge
