ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ రంగం వేగంగా విస్తరిస్తుండగా, విశాఖపట్నం మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతోంది. ఇప్పటికే అనేక ప్రముఖ ఐటీ సంస్థలు కార్యకలాపాలు ప్రారంభించిన సాగరతీర నగరానికి ఇప్పుడు మరో అంతర్జాతీయ దిగ్గజ సంస్థ రానున్నట్లు సమాచారం. ప్రముఖ గ్లోబల్ కన్సల్టింగ్ సంస్థ డెలాయిట్ (Deloitte) విశాఖపట్నంలో తన శాటిలైట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే గూగుల్, టీసీఎస్, కాగ్నిజెంట్, మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్ వంటి భారీ సంస్థలు విశాఖలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. తాజాగా డెలాయిట్ కూడా విశాఖ వైపు అడుగులు వేయడం ఐటీ రంగానికి మరింత బలం చేకూర్చే అంశంగా భావిస్తున్నారు. ముఖ్యంగా టైర్-2 నగరాల్లో కార్యకలాపాలను విస్తరించాలనే వ్యూహంలో భాగంగా డెలాయిట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
విశాఖపట్నంలోని రుషికొండ ఐటీ హిల్స్ ప్రాంతంలో కార్యాలయం ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ ప్రాంతం ఇప్పటికే ఐటీ హబ్‌గా వేగంగా అభివృద్ధి చెందుతోంది. సముద్రతీర వాతావరణం, మెరుగైన కనెక్టివిటీ, అందుబాటులో ఉన్న మౌలిక వసతులు, తక్కువ ఆపరేషనల్ ఖర్చులు వంటి అంశాలు కంపెనీలను విశాఖ వైపు ఆకర్షిస్తున్నాయి.
డెలాయిట్‌లో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులకు రీలొకేషన్ సంబంధిత మెయిల్స్ వెళ్లినట్లు సమాచారం. విశాఖపట్నం, మంగళూరు వంటి నగరాల్లో పనిచేయడానికి ఆసక్తి ఉందా అని ఉద్యోగులను అడిగినట్లు చెబుతున్నారు. దీంతో త్వరలోనే సంస్థ అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది.
డెలాయిట్ విశాఖలో ముఖ్యంగా ఐటీ కన్సల్టింగ్, టెక్నాలజీ సేవలు, గ్లోబల్ ఫైనాన్స్ ఆపరేషన్స్, బీపీవో సేవలను ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇది స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశముంది. ముఖ్యంగా ఇంజనీరింగ్, టెక్నాలజీ, ఫైనాన్స్ రంగాల్లో చదువుతున్న విద్యార్థులకు ఇది మంచి అవకాశంగా భావిస్తున్నారు.
ఇక విశాఖను ఐటీ హబ్‌గా అభివృద్ధి చేయాలనే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి ఇది మరింత ఊతమివ్వనుంది. ఇప్పటికే ప్రభుత్వం ఐటీ పెట్టుబడుల కోసం ప్రత్యేక విధానాలు తీసుకొస్తోంది. మౌలిక వసతులు, డిజిటల్ కనెక్టివిటీ, స్కిల్ డెవలప్మెంట్పై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో డెలాయిట్ వంటి అంతర్జాతీయ సంస్థలు ఆసక్తి చూపడం రాష్ట్రానికి పెద్ద ప్లస్‌గా భావిస్తున్నారు.
మరోవైపు రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి కూడా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఈ నెల 25న విజయవాడలో నిర్వహించనున్న ‘ఎంఎస్ఎంఈ గ్రోత్ కాన్క్లేవ్’ ద్వారా చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు కొత్త అవకాశాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇంధన సామర్థ్యం, గ్రీన్ ఎనర్జీ, స్థిరమైన ఉత్పత్తి విధానాలపై దృష్టి సారిస్తూ పరిశ్రమల రంగాన్ని బలోపేతం చేసే ప్రణాళికలు అమలు చేయనున్నారు.
ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ-2024 కింద రాష్ట్రంలో భారీ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు కూడా వేగంగా ముందుకు సాగుతున్నాయి. రాబోయే సంవత్సరాల్లో భారీ పెట్టుబడులను ఆకర్షించి రాష్ట్రాన్ని దేశంలో క్లీన్ ఎనర్జీ హబ్‌గా నిలబెట్టాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోంది.
ఈ నేపథ్యంలో విశాఖపట్నానికి డెలాయిట్ రావడం రాష్ట్ర ఐటీ రంగానికి మరో కీలక మైలురాయిగా మారనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
