ఏపీలో ఉచిత బస్సు పథకం రద్దు కాదు.. సోషల్ మీడియా ప్రచారంపై ప్రభుత్వం క్లారిటీ
ఆంధ్రప్రదేశ్లో మహిళల కోసం అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణ పథకం “స్త్రీ శక్తి”ను రద్దు చేయబోతున్నారనే ప్రచారం ఇటీవల సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వార్తలతో మహిళల్లో ఆందోళన నెలకొనగా, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి స్పష్టత ఇచ్చింది. ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని రద్దు చేసే ఆలోచనే లేదని చంద్రబాబు ప్రభుత్వం తేల్చి చెప్పింది.
టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల కోసం “స్త్రీ శక్తి” పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారు. ఇటీవల దివ్యాంగులకు కూడా ఈ ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని విస్తరించారు. దీంతో లక్షలాది మంది ప్రతిరోజూ ఈ పథకాన్ని వినియోగించుకుంటున్నారు.
అయితే తాజాగా డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో, ఉచిత బస్సు పథకం నిలిపివేస్తారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ విభాగం అధికారికంగా స్పందించింది.
ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో “స్త్రీ శక్తి పథకాన్ని రద్దు చేయడం లేదు. ఈ పథకంపై జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కొనసాగుతుంది” అని స్పష్టం చేసింది. గత తొమ్మిది నెలల్లో మహిళలు రాష్ట్రవ్యాప్తంగా 67 కోట్ల ఉచిత ప్రయాణాలు చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ పథకం అమలుకు సంబంధించిన సుమారు రూ.2,350 కోట్ల సబ్సిడీని ప్రభుత్వం భరిస్తోందని తెలిపింది.
ఇప్పటికే ఆర్టీసీకి రూ.720 కోట్లను ప్రభుత్వం తిరిగి చెల్లించినట్లు వివరించింది. ఈ పథకం వల్ల ఆర్టీసీకి కూడా ప్రయోజనం కలిగిందని ప్రభుత్వం పేర్కొంది. గతంలో ఆర్టీసీ బస్సుల ఆక్యుపెన్సీ సుమారు 60 శాతం ఉండగా, ప్రస్తుతం అది 92 శాతానికి పెరిగిందని వెల్లడించింది. మహిళలు ఎక్కువగా ఆర్టీసీ బస్సులను ఉపయోగించడం వల్ల పురుష ప్రయాణికుల సంఖ్య కూడా పెరిగినట్లు తెలిపింది.
ప్రభుత్వం తెలిపిన మరో ముఖ్య అంశం ఏమిటంటే, మహిళలు ప్రైవేట్ వాహనాల కంటే ఆర్టీసీ బస్సులను ఎక్కువగా ఉపయోగించడం వల్ల రోడ్డు ప్రమాదాల్లో మహిళల మరణాల శాతం 39 శాతం వరకు తగ్గినట్లు పోలీసుల అధ్యయనంలో వెల్లడైందని పేర్కొంది. అంటే ఈ పథకం మహిళల భద్రతకు కూడా తోడ్పడుతోందని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది.
ప్రస్తుతం ప్రయాణికులకు మరింత మెరుగైన సౌకర్యాలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వ సహకారంతో 1,450 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతోంది. ఈ కొత్త బస్సుల వల్ల ప్రయాణ సౌకర్యాలు మెరుగుపడతాయని, పర్యావరణ పరిరక్షణకు కూడా సహాయపడుతుందని ప్రభుత్వం చెబుతోంది. అయితే ఈవీ బస్సుల రాకకు ఉచిత ప్రయాణ పథకం రద్దుతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది.
ఎన్నికల సమయంలో టీడీపీ ఇచ్చిన ప్రధాన హామీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా ఒకటి. అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే ప్రభుత్వం ఆ హామీని అమలు చేసింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మహిళలు ప్రతిరోజూ ఈ సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నారు.
దీంతో ఉచిత బస్సు పథకాన్ని నిలిపివేస్తారనే ప్రచారం కేవలం అపోహ మాత్రమేనని ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. మహిళల సంక్షేమం కోసం ఈ పథకాన్ని కొనసాగిస్తామని పేర్కొంది.
అల్లుడిపై ప్రేమకు అద్దం.. కిలోన్నర వెండితో ప్రత్యేక చెప్పులు తయారు చేసిన మామ
About the Author
Anusha
Administrator
Anusha is a senior journalist and content writer at APNewsDaily.com with expertise in Andhra Pradesh politics, entertainment, and regional news. She has been covering Telugu news for over 5 years, bringing accurate and timely news to Telugu-speaking audiences across the world.
