ఎండాకాలంలో ఎర్ర ఉల్లిపాయలు తినడం వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. తీవ్రమైన ఎండలు, వడగాల్పుల ప్రభావం నుంచి శరీరాన్ని రక్షించడంలో ఎర్ర ఉల్లి కీలక పాత్ర పోషిస్తుందని వెల్లడిస్తున్నారు.
దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో వడదెబ్బ, డీహైడ్రేషన్, తలనొప్పి, వాంతులు, చర్మ సమస్యలు వంటి ఇబ్బందులు ఎక్కువవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆహారంలో ఎర్ర ఉల్లిపాయలను చేర్చుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
Molecules లో ప్రచురితమైన పరిశోధన ప్రకారం ఎర్ర ఉల్లిపాయల్లో ప్రోటీన్లు, ఫెనోలిక్ కాంపౌండ్స్, ఫ్లేవనాయిడ్స్, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంపై వేడి ప్రభావాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.
ఎండలో ఎక్కువసేపు ఉండటం వల్ల శరీరం నీరు, మినరల్స్‌ను కోల్పోతుంది. అయితే ఎర్ర ఉల్లిపాయల్లో నీటి శాతం అధికంగా ఉండటంతో పాటు ఎలక్ట్రోలైట్స్ కూడా సమృద్ధిగా ఉంటాయి. దీంతో శరీరానికి అవసరమైన తేమ, ఖనిజాలు అందుతాయి.
పచ్చిగా ఉల్లిపాయలు తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పెరుగన్నంతో పాటు ఎర్ర ఉల్లిపాయలు తీసుకుంటే శరీరం చల్లబడుతుందని పేర్కొంటున్నారు.
