ఎండాకాలం మొదలయ్యే సరికి శరీరంలో నీటి లోపం (డీహైడ్రేషన్) సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. మన శరీరంలో ఎక్కువ భాగం నీటితోనే తయారై ఉంటుంది. ఇది శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడం, జీర్ణక్రియ సక్రమంగా జరగడం, రక్త ప్రసరణ, మరియు విషపదార్థాల తొలగింపులో కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే రోజూ తగినంత నీరు తాగడం చాలా అవసరం.
శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువగా నీరు కోల్పోతే డీహైడ్రేషన్ వస్తుంది. చెమట, మూత్రం, వాంతులు, విరోచనాలు వంటివి శరీరంలో నీటి శాతం తగ్గించడానికి కారణమవుతాయి. ముఖ్యంగా పిల్లలు మరియు వృద్ధులు ఈ సమస్యకు ఎక్కువగా గురవుతారు. చిన్నపిల్లల్లో వాంతులు, డయేరియా వల్ల త్వరగా డీహైడ్రేషన్ వస్తుంది. పెద్దవారిలో అధిక వేడి, జ్వరం, లేదా తగినంత నీరు తాగకపోవడం వల్ల ఈ సమస్య పెరుగుతుంది.
డీహైడ్రేషన్ వచ్చినప్పుడు కొన్ని స్పష్టమైన లక్షణాలు కనిపిస్తాయి. పిల్లల్లో నాలుక, పెదాలు ఎండిపోవడం, ఏడ్చినా కన్నీళ్లు రాకపోవడం, చర్మం ముడతలు పడటం, శరీరం చల్లబడటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. పెద్దల్లో తలనొప్పి, మైకం, అలసట, బలహీనత, గందరగోళం, హార్ట్‌బీట్ వేగంగా ఉండటం, బీపీ తగ్గడం, ఆకలి లేకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. అలాగే మూత్రం ముదురు రంగులో రావడం, కండరాల్లో నొప్పి, వేడి ఎక్కువగా అనిపించడం వంటి లక్షణాలు కూడా ఉంటాయి.
శరీరంలో నీటి స్థాయి తగ్గినప్పుడు దాహం ఎక్కువగా అనిపించడం ఒక ముఖ్య సంకేతం. అలాంటి సమయంలో వెంటనే నీరు లేదా ఇతర ద్రవాలు తీసుకోవాలి. ఎక్కువగా లిక్విడ్స్ తీసుకోవడం ద్వారా ఈ సమస్యను చాలా వరకు నివారించవచ్చు. అయితే తీవ్ర స్థాయికి చేరితే ఆసుపత్రి చికిత్స అవసరం అవుతుంది.
డీహైడ్రేషన్‌ను నివారించేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. రోజుకు కనీసం 3–4 లీటర్ల నీరు తాగడం మంచిది. ఎండలో ఎక్కువసేపు ఉండకుండా చూసుకోవాలి. ముఖ్యంగా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు వెళ్లడం తగ్గించాలి. పిల్లల విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం. వారు బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా నీటి బాటిల్ ఇవ్వాలి.
ఆహారంలో నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు తీసుకోవడం కూడా చాలా ఉపయోగకరం. పుచ్చకాయ, దోసకాయ, నారింజ, స్ట్రాబెర్రీ వంటి పండ్లు శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతాయి. అలాగే తేలికపాటి, వదులుగా ఉండే దుస్తులు ధరించడం వల్ల వేడి ప్రభావం తగ్గుతుంది.
కొన్ని పరిస్థితుల్లో వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. 24 గంటల పాటు విరోచనాలు ఉండటం, తీవ్రమైన జ్వరం, గందరగోళం, ద్రవాలు తీసుకోలేకపోవడం, మలంలో రక్తం కనిపించడం వంటి లక్షణాలు ఉంటే నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి.
డీహైడ్రేషన్ చిన్న సమస్యలా కనిపించినా, దాన్ని పట్టించుకోకపోతే ప్రమాదకరంగా మారుతుంది. కాబట్టి రోజూ తగినంత నీరు తాగుతూ, సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్యను సులభంగా నివారించవచ్చు.
విజయ్–సంగీత విడాకుల కేసు 250 కోట్లు డిమాండ్..? ₹35 కోట్లకు సెటిల్మెంట్?
