రాష్ట్రాన్ని పరిశుభ్రంగా, పచ్చగా తీర్చిదిద్దే బాధ్యతలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. పరిశుభ్రత కేవలం ప్రభుత్వ కార్యక్రమంగా మిగిలిపోకూడదని, ఐదు కోట్ల మంది రాష్ట్ర ప్రజల సమష్టి బాధ్యతగా మారాలని ఆయన అన్నారు. శుక్రవారం విజయవాడలో జరిగిన స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర అవార్డులు 2026 ప్రదానోత్సవంలో సీఎం ప్రసంగించారు.
2,174 అవార్డుల ప్రదానం
ఈ ఏడాది 22 విభాగాల్లో రాష్ట్ర స్థాయిలో 130, జిల్లా స్థాయిలో 2,044 పురస్కారాలను అందజేశారు. మున్సిపాలిటీలు, పంచాయతీలు, పాఠశాలలు, ఆసుపత్రులు, హాస్టళ్లు, బస్ స్టేషన్లు, ఆలయాలు, పరిశ్రమలతో పాటు పారిశుద్ధ్య కార్మికులు, గ్రీన్ అంబాసిడర్లు ఈ అవార్డులు అందుకున్నారు. ఇకపై ప్రతి ఏటా అక్టోబర్ 2న ఈ పురస్కారాలు ఇస్తామని సీఎం ప్రకటించారు. స్వచ్ఛ చల్లపల్లి స్ఫూర్తిని రాష్ట్రమంతా ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.
పాఠశాలలు, పంచాయతీలకు ర్యాంకులు
ప్రతి పాఠశాల, పంచాయతీ, మున్సిపాలిటీకి ర్యాంకింగ్ విధానాన్ని తీసుకువస్తామని, పరిశుభ్రత విధానాలను మెరుగుపరిచేందుకు ప్రజల అభిప్రాయాలు సేకరిస్తామని చంద్రబాబు తెలిపారు. గత రెండేళ్లలో స్పష్టమైన మార్పు కనిపిస్తోందని, స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగ్స్‌లో పలు పట్టణాలు, గ్రామాలు మెరుగైన స్థానాల్లో నిలుస్తున్నాయని చెప్పారు. పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లలో నెట్ జీరో లక్ష్యాన్ని అమలు చేసేందుకు ఐఐటీ కాన్పూర్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడించారు. పట్టణాల్లో సిటీ క్లైమేట్ యాక్షన్ ప్లాన్లు అమలు చేస్తామని, మురుగునీటిని శుద్ధి చేసి తిరిగి వినియోగించే చర్యలు చేపడతామని తెలిపారు.
జీరో గార్బేజ్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యం
కృష్ణా, గోదావరి నదుల్లో మురుగు, వ్యర్థాలు కలవడం వల్ల దిగువ ప్రాంతాల ప్రజల తాగునీటికి ముప్పు ఏర్పడుతోందని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మురుగునీటి శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, జల్ జీవన్ మిషన్ కింద ఇంటింటికీ కుళాయి నీటి సరఫరాను విస్తరిస్తున్నామని చెప్పారు. చెత్తను ఎరువు, బయోగ్యాస్, విద్యుత్తుగా మార్చి వృత్తాకార ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహిస్తామన్నారు. ఇందుకోసం స్వచ్ఛ రథాలు, ఈ-ఆటోలు, తోపుడు బండ్లు, యాంత్రిక స్వీపింగ్ యంత్రాలు వినియోగిస్తున్నామని, సమీకృత ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రాలు, గోబర్ధన్ యూనిట్లు, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు.
గ్రామీణాభివృద్ధికి రూ.1.30 లక్షల కోట్లు
రానున్న ఐదేళ్లలో పల్లె పండుగ కార్యక్రమం సహా గ్రామీణాభివృద్ధికి రూ.1.30 లక్షల కోట్లు వెచ్చించనున్నట్లు సీఎం ప్రకటించారు. విద్యుత్ వాహనాలు, హరిత ఇంధనాల వినియోగం పెంచాలని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి ‘గ్రీన్ ఆంధ్రప్రదేశ్’ నిర్మాణంలో భాగం కావాలని కోరారు.
పరిశుభ్రత, ప్రజారోగ్యం విడదీయలేనివని మహాత్మా గాంధీ చెప్పిన మాటలను గుర్తుచేసిన చంద్రబాబు, శుభ్రతను రోజువారీ అలవాటుగా మార్చుకోవాలని సూచించారు. ప్రతి నెల మూడో శనివారం రాష్ట్రవ్యాప్తంగా జరిగే స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ప్రజలు చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు.
సంబంధిత వార్త: ‘స్వచ్ఛ ఆంధ్ర’కు ప్రజల సహకారం అవసరం.. పారిశుధ్యంపై మంత్రి నారాయణ పిలుపు
