మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిన్ జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. భగీరథ్ అనే మూడేళ్ల బాలుడు ప్రమాదవశాత్తూ 60 అడుగుల లోతైన బోర్వెల్లో పడిపోవడంతో స్థానికంగా ఆందోళన నెలకొంది.
ఘటన ఝలారియా గ్రామంలో చోటుచేసుకోగా, బాలుడు కుటుంబ సభ్యులతో కలిసి గొర్రెలు మేపుతుండగా ఆడుకుంటూ వెళ్లి బోర్వెల్లో పడిపోయాడు. తెరిచి ఉన్న బావిని గమనించకపోవడంతో ఈ ప్రమాదం జరిగింది.
సమాచారం అందుకున్న వెంటనే జిల్లా యంత్రాంగం అప్రమత్తమై రెస్క్యూ ఆపరేషన్ను ప్రారంభించింది. కలెక్టర్, ఎస్పీతో పాటు ఉన్నతాధికారులు సంఘటన స్థలానికి చేరుకుని చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
గడిచిన 18 గంటలుగా సహాయక బృందాలు నిరంతరం శ్రమిస్తున్నాయి. బాలుడికి శ్వాసలో ఇబ్బంది కలగకుండా పైపుల ద్వారా ఆక్సిజన్ సరఫరా చేస్తున్నారు. అలాగే అంబులెన్స్, వైద్య బృందాలను సిద్ధంగా ఉంచారు.
బాలుడు క్షేమంగా బయటకు రావాలని కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ప్రార్థనలు చేస్తున్నారు. త్వరలోనే బాలుడిని సురక్షితంగా బయటకు తీసుకురాగలమని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
