ఆంధ్రప్రదేశ్లో రాబోయే కొన్ని గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ముఖ్యంగా పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశముంది.
ఈ వర్షాలతో పాటు గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. గాలుల తీవ్రత కారణంగా పాత భవనాలు, చెట్లు, విద్యుత్ స్తంభాల దగ్గర ఉండటం ప్రమాదకరమని హెచ్చరించారు.
ప్రజలు అవసరం లేకుండా బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, పిడుగుల సమయంలో సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని సూచించారు.
