Local PoliticsPoliticsRazoleTrending

Pawan Kalyan: అన్నీ నేనే మాట్లాడాలా.? మరి మీరెందుకు.. జనసేన నేతలపై పవన్ కళ్యాణ్ సీరియస్

పార్టీపై, తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాలపై నేతలు మౌనంగా ఉండడంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జనసేన జనరల్ బాడీ సమావేశంలో మాట్లాడిన ఆయన, పదవుల్లో ఉన్నవారు బాధ్యతగా వ్యవహరించకపోతే కఠిన నిర్ణయాలు తప్పవని స్పష్టం చేశారు.

నాయకుడిపైనా, పార్టీపై నిరాధార ఆరోపణలు జరుగుతుంటే చూస్తూ ఊరుకోవడం సరైంది కాదన్నారు పవన్. “పార్టీ పదవులు తీసుకుని ఎవరు ఏం చేస్తున్నారు? పార్టీ కోసం ఎవరు నిలబడుతున్నారు?” అంటూ నేతలను నేరుగా ప్రశ్నించారు. అబద్ధపు ప్రచారాలను వెంటనే తిప్పికొట్టాల్సిన బాధ్యత పార్టీ నేతలదేనని ఆయన తేల్చిచెప్పారు.

పార్టీలో ప్రతి ఒక్కరి పనితీరుపై తనకు పూర్తి అవగాహన ఉందని పవన్ స్పష్టం చేశారు. ఎవరు ఎంత పని చేస్తున్నారు, ఎవరు బాధ్యతలు నిర్వర్తించడంలేదో తనకు పూర్తిగా తెలుసన్నారు. “అందరి జాతకాలు నా దగ్గర ఉన్నాయి” అంటూ నేతలకు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. ఇకపై నేతల తీరులో మార్పు కనిపించకపోతే ఉపేక్షించే ప్రసక్తే లేదని హెచ్చరించారు.

అరవ శ్రీధర్ అంశం దగ్గర నుంచి జోగి రమేష్ ఇంటిపై దాడి వరకు ఇటీవల జరిగిన పరిణామాలన్నింటిపైనా పార్టీ నేతలు స్పష్టమైన వైఖరి తీసుకోవాలని పవన్ ఆదేశించారు. ప్రజల్లోకి వెళ్లి నిజాలను వివరించాల్సిన బాధ్యతను నేతలు విస్మరిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

పార్టీ అభివృద్ధి, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే ప్రతి ఒక్కరు క్రమశిక్షణతో, అంకితభావంతో పనిచేయాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఇకపై పార్టీ కోసం పనిచేయని వారికి కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

ఈ సమావేశం అనంతరం మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ నేతలకు స్పష్టమైన మార్గనిర్దేశం చేశారని తెలిపారు. పార్టీపై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగాలని ఆయన సూచించినట్లు చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *